రుణమాఫీపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదు..రాజకీయ లబ్ధికోసమే పదేపదే విమర్శలు: మంతి తుమ్మల

రుణమాఫీపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదు..రాజకీయ లబ్ధికోసమే పదేపదే విమర్శలు: మంతి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: రుణమాఫీపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల  పాలనలో రూ.లక్ష లోపు రుణమాఫీని కూడా సక్రమంగా చేయలేదని విమర్శించారు. అప్పట్లో విడతలవారీగా రుణమాఫీ చేయడం వల్ల రైతులపై వడ్డీ భారం పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల లోపు పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేసినట్టు చెప్పారు. దీంతో 25 లక్షల మంది రైతులు రూ.20,616 కోట్ల ప్రయోజనం కలిగిందన్నారు. ఒకే పంటకాలంలో రూ.2 లక్షలలోపు పంట రుణాలన్నీ మాఫీ చేసిన ఏకైక  ప్రభుత్వం తెలంగాణేనని పేర్కొన్నారు.

రుణమాఫీ అమలులో పారదర్శకత కోసం వివిధ బ్యాంకుల నుంచి  ఖాతాల వివరాలు సేకరించామని, కొన్ని ఖాతాల్లో సాంకేతిక లోపాలు ఉండడంతో అధికారులు గ్రామాలవారీగా ఇంటింటికీ వెళ్లి వివరాలు సరిచేసి అర్హులైన రైతులకు నాలుగో విడతలో రుణమాఫీ అందించారని తెలిపారు. పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాల మధ్య తేడాను దాచిపెట్టి రైతులను బీఆర్ఎస్ నాయకులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీకి సంబంధించిన పూర్తి వివరాలను అసెంబ్లీలో సమర్పించామని, లబ్ధిదారుల వివరాలను గ్రామాలవారీగా అందించామని తెలిపారు. వాస్తవాలు తెలిసినా పదేపదే రుణమాఫీ జరగలేదంటూ బీఆర్​ఎస్​ నేతలు ఆరోపణలు చేయడం రాజకీయ లబ్ధికోసమేనని తుమ్మల విమర్శించారు.